Thursday, July 6, 2017

శనీషా లింగాల.--లీన్‌స్పూన్‌. కామ్‌ పని..

బరువు తగ్గాలా... మేం భోజనం పంపిస్తాం
మీరు కాబోయే అమ్మ.. కానీ మీ అవసరాలకు తగినట్టుగా పోషకాలతో మంచి వంట వండుకుని తినే సమయం లేదు. ఎవరైనా వండిపెడితే బాగుండు అనుకునే పరిస్థితి. బరువు తగ్గాలనుకునేవారూ అంతే.. అంతర్జాలంలో ఉన్నా.. సరైన కెలొరీలతో, పోషకాహారానికి సంబంధించిన వివరాలు.. చెప్పేవాళ్లు.. కుదిరితే చేసిపెట్టేవాళ్లు ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారి అవసరాలను తీర్చడమే లీన్‌స్పూన్‌. కామ్‌ పని.. పోషకాహార నిపుణుల సలహాలతో కోరుకున్నవారికీ.. వారి అవసరాలకు తగినట్టుగా అలాంటి ఆహారం అందిస్తున్నారు శనీషా లింగాల. ఆమె ప్రారంభించిన ఈ సంస్థ గురించి ఆమె మాటల్లోనే...
వరికైనా అనుభవాలే పాఠాలు నేర్పిస్తాయి కదా! నాకూ అంతే. నేను గర్భిణిగా ఉన్నప్పుడు అమ్మలా ఎవరైనా రుచికరమైన పోషకాహారం వండి పెడితే బాగుండని అనుకున్నా. కానీ ఎవరూ లేరు. చివరకు నేనే.. ఆ సేవల్ని ప్రారంభించా. ఏడాదిన్నర క్రితం ‘లీన్‌స్పూన్‌.కామ్‌’ అనే సంస్థ మొదలయ్యింది. రుచి మాత్రమే కాదు మీ ఆరోగ్య అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మా పోషకాహార నిపుణులు మీక్కావాల్సిన ఆహారపదార్థాలను అందిస్తారు. వినియోగదారులు మమ్మల్ని సంప్రదించినప్పుడు వెంటనే ‘ఆఁ ఏం కావాలో చెప్పండి’ అని ఆర్డర్‌ తీసుకునే విధానం మా దగ్గర ఉండదు. మీ ఫోనుని ముందుగా మా పోషకాహార నిపుణులే అందుకుంటారు. ఫోను, ఈమెయిల్‌ సాయంతో వాళ్లు మీతో మాట్లాడి ముందుగా మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీకున్న ఆరోగ్య సమస్యల ఆధారంగా ఒక ఆహార ప్రణాళికను రూపొందిస్తారు. అదే సమయంలో అవసరమైన వ్యాయామాల్నీ సూచిస్తారు. అందుకోసం మా దగ్గర ప్రత్యేకంగా వ్యాయామ నిపుణులు కూడా ఉంటారు. మధుమేహం, బీపీ వంటి సమస్యలుంటే అందుకనుగుణంగా ఆహారాన్ని తయారుచేస్తాం. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ.. మందులు వాడుతూ ఉంటారు. అలాగే పాలిచ్చే తల్లులూ, గర్భిణులూ ఉండొచ్చు. ఎవరికి వారికే... వ్యక్తిగతంగా సేవల్ని అందిస్తాం. బరువు తగ్గాలనుకునేవారు సన్నబడేలా సూచనలు చేస్తాం. కేవలం పోషకాహారం మాత్రమే కోరుకుంటే.. అదే సూచిస్తాం. అనారోగ్య సమస్యలుంటే.. వాటికి తగిన జాగ్రత్తలూ చెబుతాం.

ఆహారం పంపిస్తాం..
కొంతమంది బరువు తగ్గడానికీ, తీరైన ఆకృతి రావడానికి జిమ్‌కి వెళ్తుంటారు. కానీ కేవలం వ్యాయామం చేసినంత మాత్రాన బరువు తగ్గిపోరు. దాంతోపాటూ మాంసకృత్తులున్న ఆహారం అందాలి. మా దగ్గర సేవలు అందుకునేవారిలో ఇలా వ్యాయామాలు చేసే వారే ఎక్కువగా ఉంటారు. వారికి అనుగుణంగా మాంసకృత్తులు ఉండే ఆహారాన్ని సూచిస్తాం. మధుమేహులు ఉంటే పిండిపదార్థాలూ, చక్కెరలూ తగ్గించి, ఏం తినాలో చెబుతాం. అదే గర్భిణులు అయితే ఎక్కువ కెలొరీలు అందేటట్టు జాగ్రత్తలు తీసుకుంటాం. పాల పదార్థాలూ, నట్స్‌, మినరల్స్‌ వంటివి అందేటట్టు చూస్తాం. కొందరికి జస్టేషనల్‌ డయాబెటిస్‌ వంటి సమస్యలుంటాయి. అలాంటి వారికి చక్కెరని అదుపులో ఉంచే పదార్థాలని అందిస్తాం. పాలిచ్చే తల్లులకు క్యాల్షియం లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఇవేమీ ఒక్కరోజులో ఫలితానివ్వవు. కాబట్టి వారం లేదా నెలరోజుల పాటూ మా ప్యాకేజీలు ఉంటాయి. చాలామంది ముందుగా ఒక వారం పాటూ మా సేవల్ని అందుకుంటారు. తర్వాత నెల రోజులకు పొడిగించుకుంటారు. ఫలితాలు బాగుండి నెలల తరబడి తినేవారూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకుని పోషకాహార నిపుణులు దగ్గరుండి ఆహారం వండిస్తారు. కాకపోతే ఇది మాకు కాస్త కష్టం కాబట్టి.. ప్రస్తుతం కొన్ని పదార్థాలు మాత్రమే చేస్తున్నాం. ఆరు చొప్పున శాకాహార, మాంసాహార వంటకాలను తయారుచేసి పంపిస్తున్నాం. ఇందులో ఎవరికి నచ్చినవి వారు ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఎవరు ఎంత మొత్తంలో ఏ ఆహారం తీసుకోవాలనేది మేమే నిర్ణయిస్తాం. మొదట్లో కేవలం మధ్యాహ్న భోజనంతోనే ఈ సేవల్ని అందించేవాళ్లం. కానీ ఆ తర్వాత చాలామంది టిఫిన్‌ కూడా కావాలని కోరడంతో అల్పాహారం, మిడ్‌మార్నింగ్‌ స్నాక్‌, భోజనం, చిరుతిళ్లూ, కోల్డ్‌ప్రెస్డ్‌ జ్యూస్‌ల తయారీని చేపట్టాం. ప్రస్తుతం రాత్రి భోజనాన్నీ అందిస్తున్నాం. అయితే ‘పోషకాహార నిపుణులు కోరుకున్నట్టుగా తయారుచేస్తారా, సాధారణంగా చెఫ్‌లు రుచికే ప్రాధాన్యమిస్తారు కదా’ అని మీరు అనుకోవచ్చు. అందుకే మేం క్రూయిజ్‌లూ, ఫ్లైట్‌ కిచెన్‌లలో పనిచేసిన చెఫ్‌లను ఎంచుకున్నాం. మామూలు చెఫ్‌లతో పోలిస్తే.. వీరికి ఆరోగ్యస్పృహ ఎక్కువగా ఉంటుందనేది మా నమ్మకం.
ఇంజినీరింగ్‌ చదివా..
మా వినియోగదారుల్లో చాలామంది కార్పొరేట్‌ ఉద్యోగులే. మాదాపూర్‌లో మా కిచెన్‌ ఉంది. అక్కడ వండి బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌ వంటి ప్రాంతాలకు మా సేవలని అందిస్తున్నాం. మేం మొత్తం ఇరవై మందిమి. అందులో ఆరుగురు పోషకాహార నిపుణులు ఉంటే.. తక్కిన వాళ్లు వ్యాయామ నిపుణులూ, చెఫ్‌లు. ఇంతకీ నా గురించి చెప్పనే లేదు కదూ! నాది హైదరాబాదే. ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను. ప్రస్తుతం బెంగళూరులో ఎంబీఏ చదువుతున్నా. కాస్త భిన్నంగా వ్యాపార ఆలోచన చేయాలనే ఇలా పోషకాహారనిపుణులూ, ఫిట్‌నెస్‌ నిపుణులతో కలిసి ఆహారాన్ని అందిస్తున్నా. ప్రస్తుతం నెలకి వెయ్యి ఆర్డర్ల వరకూ ఉంటున్నాయి. వినియోగదారులు కోరిన సమయానికి వాళ్లుండే చోటకు ఆ పదార్థాలు వెళ్లిపోతాయి. అలాగే మేం ఆహారం అందించే బాక్సులు కూడా ప్లాస్టిక్‌వి కాకుండా కార్ట్‌బోర్డ్‌, కాగితం వంటి రీసైక్లింగ్‌ చేసినవే. త్వరలో ఇతర ప్రాంతాలకూ మా సేవల్ని విస్తరించబోతున్నాం.

No comments:

Post a Comment

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...