Thursday, July 6, 2017

రెండు చేతులూ లేని... రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన ఓ అమ్మాయి ఏం సాధిస్తుందో వూహించండి?

కళ్లు తెరిచేసరికి... రెండుచేతులూ లేవు...!
రెండు చేతులూ లేని... రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన ఓ అమ్మాయి ఏం సాధిస్తుందో వూహించండి? వూఁ..మహా అయితే తన పని తాను చేసుకోగలుగుతుందేమో! అంతకు మించి అద్భుతాలు అంటే సినిమాల్లోనే సాధ్యం. కానీ మాళవికా నాయర్‌ మాత్రం అంతకు మించిన అద్భుతాలే చేసింది. కాబట్టే ఇటీవల ఐరాస యువజన వేదిక, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌కు చెందిన గ్లోబల్‌ షేపర్స్‌ కమ్యునిటీ ల్లో సభ్యురాలిగా ఎంపికై.. అరుదైన గుర్తింపు సాధించింది. ఆ విజయాలు ఆమె మాటల్లోనే...
ప్పుడు నాకు పదమూడేళ్లుంటాయి. తొమ్మిదో తరగతి చదువుతున్నా. మా నాన్నకి రాజస్థాన్‌లోని బికనీర్‌కి బదిలీ అవ్వడంతో మా సొంతూరు కుంభకోణం నుంచి వెళ్లిపోయాం. నాకింకా గుర్తు. ఆ రోజు సెలవు నాకు. సమయం మధ్యాహ్నం ఒంటిగంటంబావు అవుతోంది. నా జీన్స్‌ ప్యాంటు ఒకటి చిరిగిపోయింది. దానిని అంచులకు జిగురుపెట్టి అంటించేస్తే తిరిగి ఉపయోగించుకోవచ్చనేది నా ఆలోచన. అంటించడానికి కాస్త బరువైన వస్తువేదైనా కావాలికదా! అందుకోసమే వెతుకుతున్నా! అక్కడంతా చెత్త. అదెలా వచ్చిందంటే మా కాలనీకి దగ్గర్లో ఆర్మీవాళ్లు రక్షణ ఆయుధాలు భద్రపరిచే విభాగం ఉంది. దాన్లో పేలుళ్లు జరిగి మా కాలనీ అంతా వాటి తాలుకూ శకలాలు వచ్చిపడ్డాయి. హమ్మయ్య! నేను వెతుకుతున్న ఆ వస్తువు దొరకనే దొరికింది అనుకున్నా ఓ బరువైన వస్తువుని చూసి. దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి... మా జీన్స్‌ప్యాంట్‌కి మరమ్మతు చేద్దామని పదేపదే ఒత్తుతున్నా. ఓ పెద్ద విస్ఫోటనం. అది పేలిన తర్వాత కానీ నాకు తెలియలేదు.. అది కూడా ఓ బాంబు శకలమే అని. ఇంట్లో వాళ్లంతా చుట్టూ చేరారు. మా అమ్మ అయితే ‘అయ్యో నా పాప చేయి... చేయి’ అని అరవడం నాకింకా గుర్తుంది. మా బంధువొకాయన నన్ను ఎత్తుకుని తీసుకెళ్తుంటే నా కాలు నా శరీరం నుంచి వేరయిన భావన కలిగింది. అంకుల్‌ నాకాలుని నా శరీరంతో కలిపి ఉంచండి అని చెబుతూనే ఉన్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తరవాత అమ్మ చెప్పింది... 70 శాతం కాలిన గాయాలు, చేతులు రెండూ తీసేయాలి, కాళ్లలో 70 శాతం నరాలు తెగిపోయాయి, ఒక దానికి పక్షవాతం అన్నారట డాక్టర్లు. వారం విడిచి వారం ఏదో ఒక సర్జరీ. అలా నేను ఏడాదిన్నర పాటూ ఆసుపత్రికే పరిమితం అయిపోయాను.
స్కూల్లో ఒప్పుకోలేదు... ఇంతలో నా స్నేహితురాలికి ఫోన్‌చేస్తే పదోతరగతి పరీక్షలకోసం ప్రిపేర్‌ అవుతున్నా అంది. చేతులు లేవు.. కానీ కాళ్లు కాస్త సహకరిస్తున్నాయి. ఓ రబ్బరు బ్యాండు తెచ్చుకుని నా మొండి చేతులకు వాటిని తగిలించి దానికి ఒక పెన్నుని గుచ్చి రాయడానికి ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. కానీ అవుతుందని నాకు అనిపించింది. అమ్మకు చెప్పా. అమ్మా పదోతరగతి పరీక్షలు రాస్తా అని. సరేనంది. స్కూల్‌ వాళ్లు మాత్రం ఒప్పుకోలేదు. దూరవిద్యలో మూడునెలల్లో సొంతంగా చదువుకున్నా. ఆధునిక పరిజ్ఞానంతో తయారుచేసిన బయో ఎలక్ట్రానిక్‌ చేతులు అమర్చుకుని వాటితో రాయడం సాధన చేశాను. అయినా పరీక్షల సమయంలో మాత్రం ఒకరి సాయం తీసుకుని పరీక్షలు రాశాను. ఫలితాల గురించి ఆలోచించలేదు.
స్టేట్‌ఫస్ట్‌ నేను... అనుకున్నదానికంటే పెద్ద విజయం సాధించాను. పదోతరగతి స్టేట్‌ ఫస్ట్‌. స్థానిక పత్రికలు నా గురించి గొప్పగా రాశాయి. విషయం తెలిసి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం నన్ను ఆహ్వానించారు. ఆయన మాటలు నాలో మరింత స్ఫూర్తిని నింపాయి. చిన్నపిల్లలా చేత్తో రాయడం సాధన చేశా. దాంతోపాటూ నడవడానికీ ప్రయత్నాలు మొదలుపెట్టా. నా గురించి అందరికీ తెలియాలి అనుకోలేదు. కానీ వైకల్యం ఉన్నవారి పట్ల సమాజం చూసే చిన్నచూపుని మార్చాలనుకున్నా. అంతేకాదు వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాలనిపించింది. వైకల్యం ఉన్నవారిని సమాజం చూడాల్సిన తీరుపై పీహెచ్‌డీ పూర్తిచేశాను. స్ఫూర్తివక్తగా మారాను. ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడున్న యువతలో స్ఫూర్తిని పెంచడం మొదలుపెట్టాను. టెడెక్స్‌ లాంటి ప్రతిష్టాత్మక వేదికలపైనా ప్రసంగించా. గత సంవత్సరం ఓ ర్యాంప్‌వాక్‌లో మోడల్‌గా పాల్గొని నాలాంటి వారిలో ఉత్తేజం తీసుకొచ్చాను. నా ప్రయత్నాన్ని గుర్తించిన ఐరాస యువజనాభివృద్ధి వేదిక (ఐఏఎన్‌వైడీ), వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌కు చెందిన గ్లోబల్‌ షేపర్స్‌ కమ్యునిటీ సంస్థలు నన్ను సభ్యురాలిగా చేర్చుకున్నాయి.

No comments:

Post a Comment

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...