Thursday, July 6, 2017

అసలు అమ్మాయిలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పెట్టడమేంట’నీ అన్నారు.

వ్యాపారం వద్దన్న అమ్మే.. శభాష్‌ అంది!
బీటెక్‌ చదివి తోరణాలు కట్టాలా అని అనుకోలేదామె. ఎంబీఏ చేసి వంట చేయాలా అనీ ఆలోచించలేదు. ఉన్నత చదువులతో పాటూ లక్ష్యమూ ఉన్నతంగా ఉండాలనుకుంది. దాన్ని సాధించేందుకు అహర్నిశలూ కష్టపడింది. ఆత్మవిశ్వాసంతో రెండు వ్యాపారాల్ని ఒంటి చేత్తో నడిపిస్తూ విజయబావుటా ఎగరేస్తోందీ యువ తరంగం. ఆమే హైదరాబాద్‌కి చెందిన జ్యోతివర్మ.
క్ష్యం ఉన్నతంగా ఉంటే.. గడ్డిపరక కూడా బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందనేది నా నమ్మకం. అందుకే నా ప్రాథమిక లక్ష్యం అమ్మకి నచ్చకపోవడంతో వదులుకున్నా. వెళ్లే దారిలోనే కొత్త అభిరుచిని అలవరుచుకున్నా. దాన్నే ఉపాధి మార్గంగా మలుచుకున్నా. స్పిజ్జా పేరుతో ఫుడ్‌కోర్ట్‌ని ఏర్పాటుచేశా. నిజానికి హోటళ్లూ, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను నిర్వహించడం అమ్మాయిలకు కత్తిమీద సామే అయినా ఓ సవాల్‌గా తీసుకున్నా. అలాగే కళలపై ఆసక్తిని డిజైనింగ్‌పై పెట్టి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేయడం మొదలుపెట్టా. సున్నా వ్యాపారాన్ని కోట్ల టర్నోవర్‌కి తీసుకురావడం ఒక్కరోజులో జరిగిపోలేదు. అదెలా జరిగిందంటే..
మా మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న చిత్రకారుడు. నా చిన్నప్పుడే ఆయన చనిపోవడంతో అమ్మే అన్నీ తానై పెంచింది. నేనూ నాన్నలా ఆర్టిస్ట్‌ కావాలనుకున్నా. అమ్మ మాత్రం నేను బాగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకుంది. అందుకే అమ్మకోసం బీటెక్‌ చదివి ఆ తరవాత వైజాగ్‌ గీతమ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశా. తరవాత యూకే వెళ్లాలని అనిపించినా...ఆ ఆలోచననీ అమ్మకోసమే వదిలేసుకున్నా.
ఆ డిజైన్‌ నచ్చి...
చదువయ్యాక కాల్కమ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో ఉద్యోగంలో చేరా. మూడేళ్లలో రెండు ప్రమోషన్లతో మంచి జీతమూ అందుకున్నా.. అయితే డిజైనింగ్‌ అంటే ఇష్టమని తెలిసిన ఓ స్నేహితురాలు తన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించమంటూ నాకు బాధ్యతలు అప్పగించింది. క్రమంగా చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తి కాస్తా ఈవెంట్‌ డిజైనింగ్‌ వైపు మళ్లింది. తరవాత మరికొందరు స్నేహితులూ, బంధువులూ కూడా వారి ఇళ్లల్లోని చిన్నచిన్న వేడుకలను నిర్వహించే అవకాశం ఇచ్చారు. అలా వారాంతాల్లో పుట్టినరోజులూ, ఎంగేజ్‌మెంట్‌ వంటి వేడుకల్ని నిర్వహించడం మొదలుపెట్టా.
ప్రముఖుల కోసమూ ..
మా స్నేహితురాలి నిశ్చితార్థం వేదిక అలంకరణ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టా. దాన్ని చూసిన నా స్నేహితుడు ఫణి ‘ఇద్దరం కలిసి పని చేద్దామా! ’ అని అడగడంతో ‘ఎల్లో ప్లానర్స్‌’ పేరుతో మూడేళ్ల క్రితం సంస్థను ఏర్పాటు చేశాం. వాటికోసం అవసరమైన వస్తువుల్ని హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నుంచే కాదు.. అవసరమైతే విదేశాల నుంచీ తెప్పించుకుంటాం. దాదాపు ముప్ఫైరకాల థీమ్స్‌ని అందుబాటులోకి తెచ్చాం. వాటిల్లో జంగిల్‌, ప్రిన్స్‌, క్వీన్‌, బార్బీ.. వంటివి అందులో కొన్ని. ప్రతినెలా సుమారు ఇరవై వరకూ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మా సేవలు హైదరాబాద్‌ మొదలు, వైజాగ్‌, కరీంనగర్‌, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సాగుతున్నాయి. పిల్లల, పెద్దల అభిరుచికి అనుగుణంగా వూహాచిత్రాలు గీసి వాటి ఆధారంగా థీమ్‌ని రెడీ చేయడం మా ప్రత్యేకత. ప్రతీ వేడుక్కీ ఓ కొత్త డిజైనును అందుబాటులోకి తెస్తాం. మా వినియోగదారుల్లో దర్శకుడు సురేందర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ‘సారొచ్చారు’ దర్శకుడు పరశురామ్‌లతోపాటూ మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులూ ఉన్నారు. ఫినిక్స్‌ గ్రూప్‌ కుటుంబానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాం.
అమ్మకు చూపించా..
ఈ కార్యక్రమాలు చేస్తూనే మరో సవాల్‌నీ తీసుకున్నా. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో స్యాలా డ్రైవిన్‌ అనే ఓ ప్రముఖ ఫుడ్‌కోర్ట్‌ ఉంది. దానికి ఎక్కువశాతం సినీ ప్రముఖులే ఖాతాదారులు. ఇక్కడున్న కొన్ని ఫుడ్‌ అవుట్‌లెట్‌లలో స్పిజ్జా కూడా ఒకటి. దాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఆశించినంత మేర వినియోగదారుల్ని ఆకట్టుకోలేకపోయింది ఓ రోజు నేనెళ్లినప్పుడు.. సమస్య ఎక్కడుందో గమనిస్తే.. మెనూలో పదార్థాల సంఖ్య చాలా తక్కువని తెలిసింది. అవీ పిజా, బర్గర్లు తప్పించి కొత్తవేవీ లేవు. దాన్ని లాభాల బాట పట్టిస్తానంటూ వారికి చెప్పా. అవకాశం ఇచ్చారు. ముందు మెనూ మార్చాలనుకున్నా. నాకు తెలిసినవే కాదు.. గూగుల్‌ ద్వారా కొన్ని వంటలు నేర్చుకుని ప్రయోగాలు చేశా. బాగున్నాయని చెప్పిన వాటిని ఆ మెనూలో ఉంచా. వాటిల్లో పాస్తా, ఆమ్లెట్లు, డిజర్టులు, మిల్క్‌షేక్‌లు వంటివెన్నో ఉన్నాయి. క్రమంగా రోజుకి వందకు పైగానే కస్టమర్లు రావడం మొదలుపెట్టారు. మొదటినెల యాభై వేల రూపాయలు వస్తే.. రెండో నెల డెబ్భైఐదువేలు...ఇలా టర్నోవర్‌ ఏడాది తిరిగే సరికి కోటిరూపాయలకు చేరుకుంది. కానీ ఇదంతా మాటల్లో చెప్పినంత సులువేం కాలేదు. అమ్మ, బంధువులూ ‘ఆడపిల్లలు వ్యాపారమంటూ తిరిగితే పెళ్లి ఎలా అవుతుంది’ అని పోరుపెట్టారు. ‘అసలు అమ్మాయిలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పెట్టడమేంట’నీ అన్నారు. ఈ మధ్యే అమ్మకు నేనే వ్యాపారాల్ని దగ్గరుండి మరీ చూపించా. అప్పుడు కానీ నాపై నమ్మకం కలగలేదు. ఈ రెండు వ్యాపారాలతో ఇరవైమూడుమంది పనిచేస్తున్నారు.

No comments:

Post a Comment

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...